విద్యా వ్యవస్థలో కీలక మార్పు ప్రారంభం
విద్యా వ్యవస్థలో కీలక మార్పు ప్రారంభం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు, విద్యా ప్రమాణాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ శిక్షణలో ప్రభుత్వ విద్యా పథకాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఈ వర్క్‌షాప్‌లో సర్పంచులకు పలు కీలక కార్యక్రమాలపై వివరాలు అందించనున్నారు. ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’ ద్వారా బడుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, కమిటీల పనితీరును వివరించనున్నారు.
మౌలిక వసతులు, పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాల కల్పనలో స్థానిక సర్పంచుల బాధ్యతను గుర్తు చేయనున్నారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అంగన్వాడీల అనుసంధానం, పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకం అమలు తీరుతో పాటు, బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడమే లక్ష్యంగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేయనున్నారు.
బడిబాటపై దృష్టి
కొత్తగా ఎన్నికైన సర్పంచుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ నెలలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో, గ్రామాల్లో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంపై సర్పంచులకు ఒకరోజు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
జిల్లా స్థాయిలో శిక్షణ
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో అన్ని జిల్లాల్లో ఈ వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. క్షేత్రస్థాయిలో పాఠశాలల నిర్వహణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని భావిస్తున్న ప్రభుత్వం, వారి ద్వారా స్థానిక ప్రజలను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
బడిబాటలో సర్పంచులే కీలకం
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు నిర్వహించే ‘బడిబాట’ కార్యక్రమంలో సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ సూచిస్తోంది. గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ బడిలో ఉండేలా చూడటం, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల సౌకర్యాలను ప్రజలకు వివరించడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచి, విద్యావ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ప్రభుత్వం భావిస్తోంది.
