సహజ వ్యవసాయానికి చేయూత..
రైతులకు ఉచితంగా డ్రమ్ములు, పండ్ల మొక్కల పంపిణీ
ఖానాపూర్ రూరల్ (ఆంధ్రప్రభ): మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సహకారంతో, అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న “పర్మాకల్చర్ సూత్రాల ద్వారా సహజ వ్యవసాయం” ప్రాజెక్టు కింద రైతులకు ఉచితంగా 40 డ్రమ్ములు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ద్రవ జీవామృతం తయారీ, వినియోగంపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు.
ద్రవ జీవామృతం వినియోగంతో నేల సారవంతత పెరగడం, ప్రయోజనకర సూక్ష్మజీవుల వృద్ధి, మొక్కల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, పంట దిగుబడి పెరుగుదల వంటి ప్రయోజనాలను రైతులకు వివరించారు. రసాయన ఆధారిత వ్యవసాయానికి బదులుగా సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల సాగు వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని సూచించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి గ్రామ సర్పంచ్ సీర్ల విజయ్, అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ సంస్థ ప్రతినిధులు, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
