ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటు..
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం..
శ్రీ సత్యసాయి, జులై 15 (ఆంధ్రప్రభ): ప్రముఖ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం శ్రీ ముద్రగడ పద్మనాభం చేసిన ఉద్యమాలు, ప్రజా జీవితంలో అందించిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అలాగే, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముద్రగడ పద్మనాభంకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజా నాయకుడిగా ఆయన అందించిన సేవలను గుర్తించి తగిన గౌరవం ఇవ్వడం స్వాగతించదగిన పరిణామమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో విశిష్ట సేవలు అందించిన నాయకులకు రాజకీయాలకు అతీతంగా గౌరవం ఇవ్వడం ఎన్డీయే ప్రభుత్వ బాధ్యతాయుత వైఖరికి నిదర్శనమని ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
