లోన్ల పేరుతో భారీ మోసం..

రూ.40 లక్షలకు పైగా ప్రజల సొమ్ము కాజేసినట్లు ఆరోపణలు

పశువుల రుణాలు ఇప్పిస్తామని వసూళ్లు..

న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుల ఆందోళన

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు నియోజకవర్గంలో కో-ఆపరేటివ్ సొసైటీ పేరుతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. బర్రెలు, పశువుల కొనుగోలుకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుంచి రూ.40 లక్షలకు పైగా వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

శాతనకోట, ముచ్చుమర్రి, మిడుతూరు గ్రామాలకు చెందిన ప్రజలను నమ్మించి సొసైటీ ఉద్యోగి ఒకరు ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. రుణాలు మంజూరు చేయిస్తానని ఒక్కో వ్యక్తి వద్ద వేల రూపాయలు వసూలు చేసి, అనంతరం రుణాలు ఇప్పించకుండా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.

ఏళ్ల తరబడి ఎదురుచూసినా రుణాలు మంజూరు కాకపోవడంతో పాటు చెల్లించిన సొమ్ము కూడా తిరిగి రాకపోవడంతో బాధితులు శనివారం నందికొట్కూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని కోరారు.

“మా కష్టార్జితాన్ని దోచుకున్నారు.. అప్పు చేసి చెల్లించిన డబ్బును తిరిగి ఇప్పించండి” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు సంవత్సరాలుగా తమ సమస్య పరిష్కారం కాలేదని, అప్పు చేసి చెల్లించిన సొమ్ము మోసపోయిందని, దీంతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.

దోపిడీకి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తాము నష్టపోయిన రూ.40 లక్షలకు పైగా సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేశారు.