Kosigi వైసీపీ జనసునామీ..
Kosigi వైసీపీ జనసునామీ..
- ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీతో కూటమిపై విమర్శల వెల్లువ
కోసిగి (Kosigi), ఆంధ్రప్రభ:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై ప్రజలను వెన్నుపోటు పొడిచిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నియోజకవర్గ స్థాయి నిరసన కార్యక్రమం శుక్రవారం కోసిగిలో భారీ ఎత్తున జరిగింది.
కోసిగిలోని రంగప్పకొండ ప్రాంతం నుంచి రేణుకా ఎల్లమ్మ తేరు బజార్ వరకు నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో దాదాపు ఏడు వేల మందికి పైగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కోసిగి జనసునామీని తలపించింది. ప్రధాన రహదారులు నీలి జెండాలతో నిండిపోగా, అడుగడుగునా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఘన స్వాగతం పలికాయి. ర్యాలీ అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనిపించడం లేదని విమర్శించారు. ప్రశ్నించే దత్తపుత్రుడు ఎక్కడ ఉన్నాడో ప్రజలు వెతుకుతున్న పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో కూడా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పారదర్శకతను పాటించకుండా యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని విమర్శించారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు తానే ఎమ్మెల్యేగా కొనసాగుతానని బాలనాగిరెడ్డి అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ప్రసంగానికి కార్యకర్తలు హర్షధ్వానాలతో స్పందించారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
