జలధార – జలహారతి పనుల ప్రభావ అంచనాకు ప్రత్యేక చర్యలు..

జలధార – జలహారతి పనుల ప్రభావ అంచనాకు ప్రత్యేక చర్యలు..

భూగర్భ జల మట్టాల పరిశీలనకు అబ్జర్వేషన్ వెల్స్ ఏర్పాటు..
క్షేత్రస్థాయి సిబ్బందికి పీజోమీటర్ల వద్ద ప్రాయోగిక శిక్షణ..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టిన వందరోజుల జలధార’, ‘జలహారతి’ కార్యక్రమాల కింద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా చేపట్టిన పనుల ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టిందని భూగర్భ జల శాఖ డిడి హెచ్ఎం రఘురాం తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల వద్ద క్షేత్రస్థాయి సిబ్బందికి భూగర్భ జల మట్టాలను కొలిచే విధానాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు.

డ్వామా పీడీ సూర్యనారాయణ, భూగర్భ జల శాఖ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జలధార – జలహారతి కార్యక్రమాల ద్వారా భూగర్భ జల మట్టాల్లో వచ్చిన మార్పులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి పనులు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా ‘అబ్జర్వేషన్ వెల్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సాధారణంగా భూగర్భ జలాల శాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న 109 పీజోమీటర్ల ద్వారా మాత్రమే నీటి మట్టాలను నమోదు చేస్తోందన్నారు.

అయితే ఈ పీజోమీటర్లు అన్ని పనుల ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడంతో, జలధార – జలహారతి పనులు చేపట్టిన ప్రాంతాల వద్ద ప్రత్యేక అబ్జర్వేషన్ వెల్స్ ఏర్పాటు చేసి, అక్కడి భూగర్భ జల స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించి నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ఈ ప్రక్రియ ద్వారా చేపట్టిన పనుల ఫలితాలు, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల, భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా అబ్జర్వేషన్ వెల్స్ ఏర్పాటు విధానం, వాటర్ లెవెల్స్ కొలిచే పద్ధతులు, డేటా నమోదు విధానం తదితర అంశాలపై డ్వామా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల సిబ్బందికి పీజోమీటర్ వద్ద ప్రాయోగిక శిక్షణ నిర్వహించారు. శిక్షణ ద్వారా ఫీల్డ్ స్థాయిలో ఖచ్చితమైన కొలతలు నమోదు చేసే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని భూగర్భ జల శాఖ డిడి తెలిపారు.

Leave a Reply