బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
- ఓటర్ల జాబితాపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
- ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లుతో శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో బిఎల్ఏ ల పాత్ర అత్యంత కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే అనర్హుల పేర్లు తొలగించే విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏవైనా సమస్యలు, అభ్యంతరాలు తలెత్తితే వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బూత్ స్థాయిలో సమన్వయంతో పనిచేస్తే పార్టీ మరింత బలపడుతుందని, ప్రతి బిఎల్ఏ బాధ్యతాయుతంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్ఏలు) పాల్గొన్నారు.
