అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించే ప్రసక్తే లేదు..
- నారాయణపేట కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమంలో బోగస్ ఓట్లను మాత్రమే తొలగించడం జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించే ప్రసక్తే లేదని నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక స్పష్టంచేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని వేగంగా చేపట్టాలని ఆదేశించారు. శనివారం ఆమె నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
స్థానిక కార్గిల్ చౌరస్తా, గ్రామ పంచాయతీ కార్యాలయాల సమీపంలో గల నివాసాలకు వెళ్ళి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) కార్యక్రమంలో బోగస్ ఓట్ల ను మాత్రమే తొలగించడం జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించే ప్రసక్తే లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంటింటికి వచ్చే బీఎల్ వో లకు ఓటర్లు సహకరించి, ఎన్యూమరేషన్ పత్రాలను తప్పక పూరించి ఇవ్వాలని ఆమె సూచించారు. ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లు త్వరగా నింపేటట్లు బీ ఎల్ వో లు, బీ ఎల్ ఏ లు చొరవ తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్ కుమార్, ఎంఈ వో మాధవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
