జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం, పేదల గృహ నిర్మాణం వంటి అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా ఎస్.పి. నితికా పంత్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్ల మంగ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం మానిక్గూడ, వాంకిడి మండలం కోమటిగూడ గ్రామాలలో 20 లక్షల రూపాయల చొప్పున నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగిందని, ఈ భవనాల ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామపంచాయతీలు గ్రామాల అభివృద్ధికి కేంద్రబిందువులుగా మారాలని, ప్రజలకు అవసరమైన సేవలు పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు.
కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య సంఘ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని, మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ, స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలతో పాటు సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు తాతముత్తాతల కాలం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సాగు భూములలోకి వెళ్లకుండా పోలీసుల ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందిస్తూ 2005 సంవత్సరానికి ముందు నుంచి సాగు చేస్తున్న పాత పోడు భూముల విషయంలో రైతులను ఎట్టి పరిస్థితులలోనూ ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు.
అదే సమయంలో కొత్తగా అటవీ భూములను ఆక్రమిస్తూ పోడు సాగు చేయకూడదని, పోడు భూములకు సంబంధించిన అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలకు సంబంధించినదని, గిరిజనేతర రైతుల సంబంధిత సమస్యలపై అధికారులతో చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుర్దాపూర్ గ్రామ రైతుల భూ సమస్యపై జిల్లా అధికారులు, అటవీశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి, చట్టపరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి సాగుకు అనుకూలమైన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని తెలిపారు.
భూములు, ఆస్తులు శాశ్వతం కావని, పిల్లలే మనకు నిజమైన ఆస్తిఅని, వారిని బాగా చదివించి ఉన్నత స్థానాలలో నిలబెట్టడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. విద్య ద్వారానే కుటుంబాలు, గ్రామాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమం, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన, మహిళల సాధికారత, రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు . ఈ కార్యక్రమాల్లో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
