ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

తల్లి–బిడ్డ ఆరోగ్యానికి కుటుంబ నియంత్రణ అవసరమని వైద్యుల సూచన

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వెంకటస్వామి చౌదరి, డాక్టర్ వినీత మాట్లాడుతూ సరైన సమయంలో గర్భధారణ, పిల్లల మధ్య తగిన వ్యవధి పాటించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

అంతరా ఇంజెక్షన్లు, ఐయూసీడీలు, కండోమ్‌లు వంటి కుటుంబ నియంత్రణ సాధనాలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. “పిల్లల మధ్య దూరం పాటిద్దాం.. తల్లి–బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుదాం” అనే నినాదాలతో టవర్ క్లాక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

అదేవిధంగా మండలంలోని పెద్దకౌకుంట్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కూడా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పలు కాలనీల వరకు అవగాహన ర్యాలీ చేపట్టి కుటుంబ నియంత్రణ, తల్లి–శిశు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు.