శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలి
జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి త్వరితగతిన ఆమోదించాలని రైల్వే లైన్ సాధన సమితి డిమాండ్
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: దేశంలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన నంద్యాల జిల్లా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలానికి నూతన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని శ్రీశైలం రైల్వే లైన్ సాధన సమితి కన్వీనర్, ప్రముఖ న్యాయవాది దేవలపాటి కాశీరావు డిమాండ్ చేశారు.
శనివారం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి దర్శనార్థం వస్తున్నప్పటికీ, ఇప్పటికీ ప్రత్యక్ష రైల్వే సౌకర్యం లేకపోవడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గతంలో రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు శ్రీశైలాన్ని సందర్శించి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీశైలాన్ని సందర్శించి అక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభవించారని పేర్కొన్నారు.
దక్షిణ భారత ప్రజల ఆకాంక్ష మేరకు శ్రీశైలం రైల్వే ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని శ్రీశైలం రైల్వే లైన్ సాధన సమితి తరఫున అభినందించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
శ్రీశైలానికి రైల్వే మార్గం ఏర్పాటుతో భక్తులకు మాత్రమే కాకుండా నల్లమల ప్రాంత అభివృద్ధి, గిరిజన సంక్షేమం, పర్యాటక రంగం, స్థానిక ఉపాధి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి విశేష ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. హైదరాబాద్–శ్రీశైలం–మార్కాపురం రైల్వే మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతం, శ్రీశైలం జలాశయం వంటి ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించి త్వరితగతిన ఆమోదించాలని కోరారు.
ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, భక్తులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని దేవలపాటి కాశీరావు విజ్ఞప్తి చేశారు.
