సర్పంచ్‌లకు తగిన గౌరవం, వేతనం లేదు – మాజీ సర్పంచ్ పడిశాల భద్రయ్య.

ఖమ్మం, ఆంధ్రప్రభ: తెలంగాణలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రజాప్రతినిధి సర్పంచ్ మాత్రమేనని మాధాపురం మాజీ సర్పంచ్ *పడిశాల భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జన ధ్రువీకరణ నుంచి మరణ నమోదు వరకు, తాగునీటి సమస్య నుంచి పారిశుధ్యం వరకు, వీధి దీపాల నుంచి రోడ్ల నిర్మాణం వరకు, సంక్షేమ పథకాల అమలు నుంచి ప్రజల నిత్య సమస్యల పరిష్కారం వరకు ప్రతి విషయంలో ప్రజలు ఆశ్రయించేది సర్పంచ్‌నేనని అన్నారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య తొలి వారధి సర్పంచ్ అయినప్పటికీ, ప్రజలకు అత్యంత చేరువలో ఉండే ఈ ప్రజాప్రతినిధికి దక్కేది అత్యల్ప గౌరవం, గుర్తింపు అని అన్నారు.

“అధికారాలు లేవు, బాధ్యతలు మాత్రం మావే”
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీరందరూ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే. అదే విధంగా సర్పంచ్ కూడా ప్రజల ప్రత్యక్ష ఓట్లతో ఎన్నికవుతాడు. ప్రజాస్వామ్యపరంగా అందరి చట్టబద్ధత ఒక్కటే. కానీ వేతనాలు, భత్యాలు, కార్యాలయ సదుపాయాలు, సిబ్బంది, వైద్య భద్రత, పదవీ విరమణ తర్వాత పెన్షన్ విషయంలో మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని ఆరోపించారు. ఐదేళ్లు గ్రామ ప్రజలకు సేవ చేసిన సర్పంచ్… పదవీ కాలం ముగిసిన వెంటనే సాధారణ పౌరుడిగా మిగిలిపోతాడని, ఇది ప్రజాస్వామ్య సమానత్వ సూత్రానికే విరుద్ధమని అన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువ
తెలంగాణలో ప్రస్తుతం సర్పంచ్‌కు నెలకు కేవలం రూ.6,500 గౌరవ వేతనం మాత్రమే ఉందని, రోజుకు లెక్కిస్తే రూ.220 కూడా కాదని తెలిపారు. కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పర్యవేక్షించే ప్రజాప్రతినిధి శ్రమను ఇంత తక్కువ మొత్తంతో కొలవడం గ్రామ పాలన పట్ల ప్రభుత్వ దృక్పథాన్నే ప్రశ్నిస్తున్నదని అన్నారు.

గోవాలో నెలకు దాదాపు రూ.20 వేల వరకు, కేరళలో రూ.15 వేలు, పంజాబ్‌లో రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు, హర్యానాలో రూ.10 వేలకు పైగా వేతనంతో పాటు ఇతర భత్యాలు కూడా ఇస్తున్నారని ఉదహరించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నందునే గ్రామీణాభివృద్ధి సూచికల్లోనూ అవి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు.

సంస్కరణలు అత్యవసరం
ప్రజలకు సమాధానం చెప్పాల్సింది సర్పంచ్, కానీ నిధులు, పరిపాలనా అనుమతులు, సాంకేతిక ఆమోదాలు, ఆర్థిక స్వేచ్ఛ మాత్రం అధికారుల చేతుల్లోనే ఉంటున్నాయని అన్నారు. దీనివల్ల “బాధ్యతలు సర్పంచ్‌వి, అధికారాలు మరెవరి చేతుల్లోనో” అనే పరిస్థితి ఏర్పడిందని, ఇది స్థానిక స్వపరిపాలన భావనను నిర్వీర్యం చేస్తోందని అన్నారు.

ఈ నేపథ్యంలో సర్పంచ్ గౌరవ వేతనాన్ని కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని, పదవీకాలం పూర్తి చేసిన వారికి గౌరవప్రదమైన పెన్షన్, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు రాజ్యాంగం కల్పించిన ఆర్థిక, పరిపాలనా అధికారాలను పూర్తిస్థాయిలో బదిలీ చేయాలని, డిజిటల్ పాలన, ఆర్థిక నిర్వహణ, చట్టపరమైన అంశాలపై నిరంతర శిక్షణ అందించాలని కోరారు.

“గ్రామ స్వరాజ్యం బలపడాలంటే సర్పంచ్ బలపడాలి. సర్పంచ్ బలపడాలంటే గౌరవం, అధికారాలు, ఆర్థిక భద్రత కల్పించాలి. గ్రామాన్ని గౌరవించే ప్రభుత్వమే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం” అని పడిశాల భద్రయ్య పేర్కొన్నారు.