నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ…

నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ…
ఓటరు జాబితాయే మన బ్రహ్మాస్త్రం.. దొంగ ఓట్లపై డేగకన్ను వేయాలి.
బీఎల్‌వోలతో నిరంతరం సమన్వయం చేసుకోండి.
ఖమ్మం ప్రశిక్షణా శిబిరంలో శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు దిశానిర్దేశం.
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : కుటుంబ పాలనకు తావులేకుండా, దేశమాత సేవ కోసం జాతీయవాదాన్ని పుణికిపుచ్చుకుని నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. పార్టీలో ఒక సాధారణ కార్యకర్త సైతం అత్యున్నతమైన జాతీయ అధ్యక్షుడు కాగలరని, ఆ ఘనత కేవలం భాజపాకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో మంగళవారం మూడవ పట్టణ అధ్యక్షురాలు దార్ల మల్లేశ్వరి అధ్యక్షతన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్’ కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరితంగా జరిగింది.
ఈ శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. పార్టీ సిద్ధాంతాలు, పనితీరుపై కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల నుంచి కొత్తగా భాజపాలోకి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ముందుగా పార్టీ సిద్ధాంతాలను పూర్తిగా వంటబట్టించుకోవాలని సూచించారు. పార్టీలో పదవుల కంటే క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే బూత్ స్థాయి అధ్యక్షుడికే అత్యున్నత గౌరవం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే ప్రతి నాయకుడు ముందుగా తమ బూత్ పరిధిలోని ఓటరు జాబితాపై (ఓటర్ లిస్ట్) సంపూర్ణ పట్టు సాధించాలన్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కార్యకర్తలు అత్యంత చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.

తమ బూత్ పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారు? వారిలో ఎవరైనా మరణించారా? వేరే ప్రాంతాలకు వలస వెళ్లారా? తదితర వివరాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలన్నారు. ముఖ్యంగా రోహింగ్యాలు లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వారు అక్రమంగా దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారా అనే దానిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అలాంటి వాటిని తక్షణమే అడ్డుకోవాలని హెచ్చరించారు.

ప్రత్యర్థి పార్టీల నాయకులు కుట్రపూరితంగా భాజపాకు సానుభూతిపరులైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రమాదం ఉన్నందున ముందే అప్రమత్తం కావాలన్నారు. ప్రతి బూత్‌కు బాధ్యత వహించే బూత్ లెవల్ అధికారులతో (బీఎల్‌వో) ఎప్పటికప్పుడు మమేకమవుతూ సమన్వయం చేసుకోవాలని, జాబితాను పక్కాగా సరిచూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రతి కార్యకర్తా ఓటర్లతో మమేకమై క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సన్నీ ఉదయ ప్రతాప్, గెంటెల విద్యాసాగర్, మేకల నాగేందర్, నకిరేకంటి వీరభద్రం,డోకుపర్తి రవీందర్, ఫమ్మి అనిత, ఆర్ వి ఎస్ యాదవ్ , శాసనాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
