అంతర్జాతీయ వేదికపై మెరిసిన మేడ్చల్ యువకుడు
- మల్లారెడ్డి ఘన సన్మానం
మేడ్చల్, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ వేదికపై మేడ్చల్ జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన రాక్‌బాల్ భారత జట్టు క్రీడాకారుడు ఇటబోయిన గోపాల్ యాదవ్‌ను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అభినందించారు. నేపాల్ రాజధాని ఖాట్మండ్ వేదికగా జూన్ 27 నుండి జూలై 3 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక దక్షిణాసియా మొదటి రాక్‌బాల్ టోర్నమెంట్’లో భారత జట్టు ఘనవిజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. జూలై 1న జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ జయభేరి మోగించింది.
ఈ అంతర్జాతీయ విజయంలో కీలక పాత్ర పోషించిన మేడ్చల్ జిల్లా పూడూరు పట్టణానికి చెందిన జాతీయ జట్టు సభ్యుడు ఇటబోయిన గోపాల్ యాదవ్, తెలంగాణ టీమ్ కోచ్ చిట్కుల లక్ష్మణ్‌లతో కలిసి గురువారం బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే మల్లారెడ్డినీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపాల్ యాదవ్‌కు మల్లారెడ్డి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.
గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా మల్లారెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్, పూడూరు మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ ఎంపీటీసీ రఘు, మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, శేఖర్ రెడ్డి, స్థానిక యువకులు అనిల్ యాదవ్, పరమేశ్, లక్ష్మణ్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
