వన్‌వే విధానం అమలు చేయాలి..

  • ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బీజేఆర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు రోడ్డు మధ్యలో డివైడర్ లేకపోవడంతో వాహనాల రాకపోకలు అస్తవ్యస్తంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గంలో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ట్రాఫిక్ నిర్వహణలో సరైన ప్రణాళిక లేకపోవడంతో తరచూ రద్దీ నెలకొంటోందని పేర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ మార్గం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, అక్కడి నుంచి బీజేఆర్ చౌరస్తా మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు వన్‌వే విధానాన్ని అమలు చేయాలని, తిరుగు ప్రయాణంలో బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ చౌరస్తా, మహాశక్తి చౌరస్తా మీదుగా బీజేఆర్ చౌరస్తాకు వచ్చేలా మరో వన్‌వే ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పలువురు సూచిస్తున్నారు.

అలాగే రైల్వే ఓవర్‌బ్రిడ్జి దిగిన అనంతరం వాహనాలను పోలీస్‌స్టేషన్ రోడ్డులోకి అనుమతించకుండా నేరుగా ఎన్టీఆర్ చౌరస్తా వైపు మళ్లించాలని, బీజేఆర్ చౌరస్తా నుంచి పోలీస్‌స్టేషన్ రోడ్డులో వన్‌వే అమలు చేయాలని కోరుతున్నారు. గతంలో వికారాబాద్ డీఎస్పీగా పనిచేసిన చౌడేశ్వరి హయాంలో బస్టాండ్ వైపు వన్‌వే అమలు చేయడంతో ట్రాఫిక్ సమస్య కొంతవరకు అదుపులో ఉండేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా చర్చించి ట్రాఫిక్ నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.