సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం..

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయం
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పోటు (ప్రసాదశాల) అన్నప్రసాద భవన నిర్మాణ పనులను గురువారం కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. ​జులై 15 లోపు ఇంద్రకీలాద్రి ‘మాస్టర్ ప్లాన్’ డ్రాఫ్టు నమూనా సిద్ధం కావాలి. ​శ్రావణ మాసంలోగా నూతన లడ్డూ పోటు, అన్నదాన భక్తుల కోసం వినియోగం లోనికి తేవాలి.

నిర్మాణ ​పనుల జాప్యం పై దేవాదాయ కమిషనర్ అసంతృప్తి…

​భక్తులకు వీలయినంత స్థలాన్ని వినియోగం లోనికి తీసికొని రావటం కోసమే సదరు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని,అంతేకాని షాపులను ఏర్పాటు చేయడం కోసం కాదు అని దేవస్థానం సిబ్బందికి గట్టిగా కమిషనర్ మందలించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఉన్నతాధికారులతో కలిసి ఆయన పనుల ప్రగతిని సమీక్షించారు. ​​ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ రాబోయే శ్రావణ మాసం నాటికి నూతన లడ్డూ పోటు, అన్నదాన భవనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, ఇంద్రకీలాద్రి భవిష్యత్తు అవసరాలను దృష్టి లో ఉంచుకుని రూపొందిస్తున్న ‘మాస్టర్ ప్లాన్’ తుది నమూనాను జులై 15 లోపు సిద్ధం చేసి తమకు సమర్పించాలని ఆదేశించారు.

​వరుస పర్యవేక్షణలు చేస్తున్నా జాప్యమా?…

​క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కమిషనర్ కే రామచంద్ర మోహన్ మొదట నూతన లడ్డూ పోటు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “నేను స్వయంగా ఇన్నిసార్లు పర్యవేక్షిస్తూ, దిశానిర్దేశం చేస్తున్నా ఇంకా పనులు కొనసాగుతూనే ఉండటం ఏమిటి?” అని ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని, యుద్ధప్రాతిపదికన రేయింబవళ్లు (24/7) షిఫ్టుల వారీగా పనులు నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా కమిషనర్ భవనానికి వేసే రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని పేర్కొంటూ రంగులు ఎంపిక చేసారు, లడ్డు పోటు ఫ్లోర్ నిర్మాణం పరిశీలన చేశారు.

​నిధులు, సమయం వృథా చేస్తే సహించేది లేదు..

​అనంతరం నూతన అన్నదాన భవనాన్ని పరిశీలించిన కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్, అక్కడ జరుగుతున్న పనులలో తగినంత వేగవంతంగా జరగటం లేదని అభిప్రాయ పడ్డారు. నిర్మాణ పనులు చేసేటప్పుడు వృధా వ్యయాన్ని అరికట్టాలని కమిషనర్ కే రామచంద్ర మోహన్ సూచించారు. ఇక్కడ జరిగే ప్రతి పని భక్తులకు 100% ఉపయోగపడేలా, అత్యంత నాణ్యతతో ఉండాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని,. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రావణ మాసంలో ఈ రెండు భవనాలు ప్రారంభమై భక్తుల సేవకు వినియోగపడాలని అన్నారు. రాబోయే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నాటికి నూతన పోటులోనే ప్రసాదం తయారీ, నూతన భవనంలోనే అన్నప్రసాద వితరణ జరగాలని,. ఇది భక్తుల సౌకర్యాలకు సంబందించిన విషయం, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించం” అని కమిషనర్ చెప్పారు.

​క్యూ కాంప్లెక్స్ కింద దుకాణాల ఏర్పాటుపై కమిషనర్ ఫైర్..

భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూపుదిద్దుకుంటున్న ఎలివెటెడ్ క్యూ కాంప్లెక్స్ క్రింది భాగంలో కూల్ డ్రింక్ షాపులు, క్లోక్ రూమ్‌ మరియు ఇతర వాణిజ్య ఏర్పాట్లు చేయడంపై కమిషనర్ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై దేవాలయ అధికారులను అక్కడికక్కడే వివరణ కోరారు. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన స్థలాల్లో ఇలాంటి వ్యాపార ఏర్పాట్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి అంగుళం స్థలం కేవలం భక్తుల అవసరాలకు, వారి సౌకర్యాలకే ఉపయోగపడాలని అధికారులకు గట్టిగా హితవు పలికారు. ​ఈ విస్తృతస్థాయి పర్యటనలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), డిప్యూటీ ఈవో శ్రీ కిషోర్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీమతి రమ, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ రంగారావు, ఆలయ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.