రామాయణంలో మంథర.. కథను మలుపుతిప్పిన కీలక పాత్ర

రామాయణంలో మంథర.. కథను మలుపుతిప్పిన కీలక పాత్ర

కైకేయి నిర్ణయం వెనుక మంథర పాత్ర

రాజనీతి, వారసత్వంపై మంథర ఆలోచన

రామాయణ గమనాన్ని మార్చిన నిమిత్తమాత్రురాలు

“అందరూ అయోధ్యనే ఏలితే అడవులను ఎవరేలాలి?” అన్న సామెతను గుర్తుకు తెచ్చే పాత్ర రామాయణంలో మంథర. తాను రాజధర్మాలు, లౌకిక ధర్మాలు తెలిసిన స్త్రీ. తన సంకల్పానికి అనుగుణంగా కైకేయిని నడిపించి, కార్యాన్ని సాధించిన సాధారణ పరిచారిక. రామాయణ గాథనే ఒక మలుపు తిప్పిన పాత్ర. రామ పట్టాభిషేకమనే వార్తతో అందరూ ఆనందంలో మునిగిపోయిన సమయంలో, రాబోయే పరిణామాలను ఊహించి తన యజమానురాలి క్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి మంథర. సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయంలో మనసులో ఏర్పడే కల్లోల స్థితిని “మంథరా” అన్నారు. మంథర దేవతల కార్యాన్ని సాధింపజేసేందుకు కైకేయికి దాసిగా పంపబడిన అప్సరసగా పద్మపురాణం చెబుతుంది.

దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలని భావించాడు. పురజనులతో సంప్రదించాడు. అందరూ ఏకగ్రీవంగా సమ్మతించారు. శ్రీరాముడిని పిలిపించాడు. “రామా! భరతుడు తన మేనమామల ఇంటికి వెళ్లాడు. అతను వచ్చేవరకు ఆలస్యం కావచ్చు. ప్రాణం జారిపోయే సమయం చేరువయ్యే కొద్దీ బుద్ధి పెడదారులు తొక్కుతుంది. నిలకడ తగ్గుతుంది. నేను లేకపోతే ఈ రాజ్యం నీకు దక్కకుండా ఎవరైనా అడ్డం పడవచ్చు. కాబట్టి రేపు పుష్యమి నక్షత్రం. రేపే నీకు పట్టాభిషేకం” అన్నాడు. సరేనన్నాడు రాముడు.

పట్టణం శోభాయమానంగా అలంకరించబడుతోంది. ఇదంతా గమనిస్తున్నది మంథర. మంగళధ్వనులను విన్నది. రామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని గ్రహించింది. ఆలోచించింది. ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి కైకేయి ప్రాసాదానికి వెళ్లింది. కైకేయితో రామ పట్టాభిషేక వార్తను చెప్పింది. కైకేయి సంతోషంతో కంఠాభరణాన్ని బహుమానంగా ఇచ్చింది. మంథర ఆ బహుమానాన్ని తీసుకోలేదు. సరికదా ఆమెను తీవ్రంగా మందలించింది.

“కైకేయీ! నీవెంత అమాయకురాలివి. ముంచుకొస్తున్న ఆపదను గుర్తించకుండా సవతి కుమారునికి పట్టాభిషేకం జరుగుతుంటే ఆనందపడుతున్నావు. రేపటి నుంచి కౌసల్య రాజమాత అయితే నీవు ఆమెకు సేవ చేయాల్సి వస్తుంది. నీ క్షేమం కోరి చెప్పే నా మాటలను జాగ్రత్తగా విను. ఇన్నాళ్లు నీ సుఖదుఃఖాలనే నావిగా భావించాను. నీ భర్తే నీకు కాలయముడై రామునికి పట్టాభిషేకం చేస్తూ నీకూ, నీ కుమారుడికీ అన్యాయం చేస్తున్నాడు. భరతుడు దూరంగా ఉన్నప్పుడే రామునికి పట్టాభిషేకం చేయడంలో అంతరార్థం ఏమిటి? ఆలోచించు. రాముడు రాజయితే అతని సంతానమే ఉత్తరోత్తర అధికారులుగా రాజ్యాన్ని పాలిస్తారు. భరతుడు, అతని సంతానం వారికి సేవలందించే వారిగానే మిగిలిపోతారు. అది తరతరాల దాస్యం అవుతుంది. ఇప్పటి నీ అజ్ఞానమే భరతుని భవిష్యత్తుకు శాపంగా మారుతుంది” అంటూ పలు విధాలుగా నూరిపోసింది.

అలా భరతుని పట్టాభిషేకానికి, రాముని వనవాసానికి అవసరమైన ప్రణాళికను రచించి కైకేయిని సిద్ధం చేసింది. దైవకార్యం ఎలా ఉన్నా మంథర కుటిల రాజనీతి అయోధ్యను అడవిగానూ, అడవిని అయోధ్యగానూ మార్చడంలో కీలక పాత్ర పోషించింది.

“కైకేయీ! నిన్ను రాజమాతగా చూడడమే నా జీవిత లక్ష్యం. భరతుడు రాజయితేనే నీవు రాజమాతవు కాగలవు. దానికి మార్గం చెబుతాను విను. శంభరాసురుడితో జరిగిన యుద్ధంలో దశరథుడు మూర్ఛపోయే సమయంలో నీవు తెలివిగా రథాన్ని తప్పించి అతన్ని కాపాడావు. అప్పుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకో. ఒకటి భరతుడు రాజుగా ప్రకటించబడాలి. రెండోది రాముడు అరణ్యానికి వెళ్లాలి. దశరథుడు వివిధ రత్నాలు, విలువైన వస్త్రాలు ఇస్తానని ప్రలోభపెట్టినా లొంగిపోవద్దు. ముందుగా ఆయనతో ఒట్టు పెట్టించుకుని ఆ తర్వాత వరాలను కోరుకో” అంటూ కైకేయిని ప్రభావితం చేసింది.

ఆ మాటలతో కైకేయికి పోయిన తెలివి తిరిగి వచ్చినట్లయింది. మంథర ఆలోచనను ఆచరణలో పెట్టింది. ఫలితంగా రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్లాడు.

మంథర పాత్రను లోతుగా పరిశీలిస్తే ఆమె ఆలోచనల్లో స్వార్థం మాత్రమే కాక, వారసత్వ రాజకీయాలపై తగినంత అవగాహన కూడా ఉన్నదని తెలుస్తుంది. రాముని గుణగణాలను మంథర ఎప్పుడూ తిరస్కరించలేదు. అయినా రాజ్యపాలనలో ప్రేమలు, గుణగణాలకన్నా వారసత్వ హక్కులే ప్రభావం చూపుతాయని, అధికారాన్ని కోల్పోయిన వంశం క్రమంగా ప్రభావాన్ని కోల్పోతుందని ఆమె గ్రహించింది. కైకేయి హృదయంలో దాగి ఉన్న మాతృహృదయాన్ని గుర్తించింది. ఆమె మనసులోని అంతర్లీన భావాలకు రూపం ఇచ్చింది.

మంథర లేకపోతే రాముడు వనవాసానికి వెళ్లేవాడా? వనవాసం లేకపోతే సీతాహరణం, రావణవధ జరిగేవా? ఈ ప్రశ్నలకు సమాధానం వెదికితే మంథర పాత్ర ప్రాముఖ్యం స్పష్టమవుతుంది. మంథర వ్యక్తి కాదు, విధి చేతిలోని సాధనం. దేవతలు సంకల్పించిన కార్యానికి ఆమె నిమిత్తమాత్రురాలు. ఆమె మాటలు కైకేయి నోట పలికినా, వాటి వెనుక కాలం నడిపించిన దైవసంకల్పం దాగి ఉంది. రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు అయితే, కథను ముందుకు నడిపించిన శక్తి మాత్రం మంథరే. రామాయణ మహాకావ్య గమనాన్ని మార్చిన కీలక పాత్రగా మంథర చిరస్మరణీయంగా నిలిచింది.

– పాలకుర్తి రామమూర్తి