అడవుల పెంపునకు వినూత్న ప్రయోగం

అడవుల పెంపునకు వినూత్న ప్రయోగం

877 హెక్టార్లలో 9.02 లక్షల విత్తన బంతుల లక్ష్యం

డ్రోన్లతో కొండలపై విత్తనాల వెదజల్లింపు

పచ్చదనం పెంపునకు అటవీశాఖ సరికొత్త కార్యాచరణ

పోలవరం (రంపచోడవరం) జిల్లా ఆంధ్రప్రభ బ్యూరో: భానుడి భగభగలు, పడిపోతున్న భూగర్భ జలాలు, గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికల నేపథ్యంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసింది. మానవాళి ముందున్న అతిపెద్ద సవాళ్లను అధిగమించేందుకు విత్తన బంతులు (సీడ్ బాల్స్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కలిసి సరికొత్త హరిత విప్లవానికి నాంది పలుకుతున్నారు. “ధరిత్రికి పచ్చటి హారం.. విత్తన బంతుల విప్లవం” అనే నినాదంతో ఏజెన్సీలో విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు చేపట్టారు. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో లక్షలాది మొక్కలను పెంచేందుకు ఈ విధానం సంజీవనిలా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో విత్తన బంతులను వెదజల్లి పచ్చదనాన్ని పెంచేందుకు అటవీశాఖ నడుం బిగించింది.

వర్షాకాలానికి ముందు ఈ విత్తన బంతులను ఖాళీ ప్రదేశాలు, కొండ ప్రాంతాల్లో వెదజల్లుతారు. మట్టి కవచం ఉండటంతో పక్షులు, కీటకాలు, ఎలుకలు విత్తనాలను తినలేవు. వర్షం పడగానే మట్టి బంతి నీటిని గ్రహించి నానిపోతుంది. అందులోని ఎరువు విత్తనానికి పోషణ అందించి అది వేగంగా మొలకెత్తి మొక్కగా ఎదుగుతుందని అటవీ అధికారులు తెలిపారు.

877 హెక్టార్లలో 9 లక్షల 2 వేల విత్తన బంతులు

రాజమహేంద్రవరం అటవీ సర్కిల్ పరిధిలోని పోలవరం (రంపచోడవరం) జిల్లాలో సుమారు 877 హెక్టార్ల విస్తీర్ణంలో 9 లక్షల 2 వేల విత్తన బంతులు వెదజల్లేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

రంపచోడవరం అటవీ డివిజన్ పరిధిలోని 6 అటవీక్షేత్రాల పరిధిలోని 21 సెక్షన్లలో 86 ప్రాంతాల్లో 437.13 హెక్టార్లలో సుమారు 4 లక్షల విత్తన బంతులు వెదజల్లే పనులు కొనసాగుతున్నాయి.

అదే విధంగా చింతూరు అటవీ డివిజన్ పరిధిలోని 5 అటవీక్షేత్రాల 22 సెక్షన్లలోని 60 బీట్ల పరిధిలో 47 ప్రాంతాల్లో 440.50 హెక్టార్లలో సుమారు 5 లక్షల 2 వేల 200 విత్తన బంతులు వెదజల్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా జిల్లాలోని రెండు అటవీ డివిజన్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నారు.

డ్రోన్ల ద్వారా విత్తన బంతుల వెదజల్లింపు

అటవీ సిబ్బంది సులభంగా చేరుకోలేని నిటారుగా ఉన్న కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో కూడా పచ్చదనాన్ని పెంచేందుకు ఇప్పుడు డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు.

రంపచోడవరం అటవీ డివిజన్ పరిధిలో 200 హెక్టార్లలో సుమారు 2 లక్షల విత్తన బంతులు, చింతూరు అటవీ డివిజన్ పరిధిలోని 12 ప్రాంతాల్లో 191.14 హెక్టార్లలో 2,29,368 విత్తన బంతులను డ్రోన్ల ద్వారా గాల్లో నుంచి వెదజల్లుతున్నారు.

దీంతో సమయం ఆదా కావడంతో పాటు అత్యంత తక్కువ ఖర్చుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచే అవకాశం ఏర్పడుతోంది.

ఇంటి వద్ద చిన్న ప్రయత్నంగా ప్రారంభమయ్యే ఈ సీడ్ బాల్ ప్రక్రియ రేపటి తరాలకు మహావృక్షాలుగా మారుతుందన్న ఆశాభావాన్ని అటవీశాఖ వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనకు అటవీశాఖ ఆచరణ రూపం ఇచ్చింది. ఈ వినూత్న కార్యక్రమం ఎంత మేర విజయవంతమవుతుందో వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సి ఉన్నప్పటికీ, ఫలితాలు ఆశించిన విధంగా వస్తే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంపునకు ఇది కీలక మైలురాయిగా నిలిచే అవకాశముంది.