రజకుల సమస్యలను పరిష్కరించాలి
మోత్కూర్, ఆంద్రప్రభ: మోత్కూర్ పట్టణంలో రజక వృత్తిదారుల కుటుంబ సర్వే ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సర్వేలో అనేక సమస్యలు సంఘం దృష్టికి వచ్చాయని వెంకటేష్ అన్నారు.
ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు ఒక్కొక్క వృత్తిదారుని మీద రూ.30,000 నుండి రూ.90,000 పైగా బకాయిలు ఉన్నాయని,ప్రభుత్వం మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో రజకుల సంక్షేమానికి వేలకోట్ల నిధులను ప్రకటించి, ఎక్కడ కూడా ఆ నిధులను వారి సంక్షేమానికి ఖర్చుచేయలేదన్నారు. వెంటనే ఆ బడ్జెట్ ను విడుదల చేసి ఉచిత విద్యుత్ పెండింగ్ బిల్లులు చెల్లించి వృత్తి దారులపైన భారం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
రజకులకు ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉతికే బట్టలను భుజాల మీద మోయ్యడంతో మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, వారికి మోపెడ్ వాహనాలను అందించాలని, 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రజకులు వృత్తి నిర్వహణలో భాగంగా అనేక అంటూ వ్యాధులు, ఆరోగ్య సమస్యల కు గురవుతున్నందున వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రజకుల ఇస్త్రీ షాపులపై దాడులు, తొలగింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రజకులపై కులం పేరుతో జరుగుతున్న వివక్షతను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో రజక వృత్తి దారుల సంఘం నాయకులు కూసంపల్లి సోమనర్సయ్య,బొడ్డుపల్లి మైసయ్య, బొడ్డుపల్లి లక్ష్మణ్, కూసంపల్లి ఉపేందర్, బొడ్డుపల్లి శివాజీ, కూసంపల్లి యాకయ్య, ఎలిమినేటి సంతోష్,కె అంజమ్మ, బి చిన్న ఫఖీర్, బొడ్డుపల్లి సువర్ణ, పాశం లక్ష్మి, మంగమ్మ, కొండ్రాతి యాదయ్య, బి. బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.
