రేవంత్ ప్రభుత్వంపై ఆరోపణలు సరికావు
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : నడిగడ్డ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు రాసిన బహిరంగ లేఖపై ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్‌కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌రావుకు లేదని విమర్శించారు.
బుధవారం ఇటిక్యాలలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్డీఎస్ పరిధిలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని, ఒక తట్ట మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. గతంలో ఆర్డీఎస్ అంశంపై పాదయాత్ర చేసిన కేసీఆర్, 12 ఏళ్ల పాలనలో ఆ ప్రాజెక్టు అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆర్డీఎస్ సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించామని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా వాసి కాకపోయినా నడిగడ్డ ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడటంతో తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
ఎన్నికలు, రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు తుమ్మిళ్ల లిఫ్ట్‌ను తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల లిఫ్ట్‌తో పాటు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో జిల్లాలో ఆర్డీఎస్తో పాటు జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతుండటంతోనే హరీష్‌రావు బహిరంగ లేఖల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నడిగడ్డ ప్రాంత రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తానని సంపత్‌కుమార్ స్పష్టం చేశారు.
