రైతు పేదల సంక్షేమానికి వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులు, పేదల సంక్షేమాన్ని జీవిత ధ్యేయంగా తీసుకుని పాలన సాగించిన మహానేత అని ఊట్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సి. సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవను చాటుకున్నారు. అలాగే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, డాక్టర్ వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి ఎన్నో చారిత్రాత్మక పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా లక్షలాది కుటుంబాలకు మేలు జరిగిందన్నారు. వైఎస్సార్ చూపిన సంక్షేమ బాటలోనే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక భరోసా లభిస్తోందని, వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు, పేదల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఎల్కోటి నారాయణరెడ్డి, సర్పంచ్, లు కథలప్ప, నాగేష్, బస్వరాజ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోర మహేష్ రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షులు జలాల్, పట్టణ అధ్యక్షులు కొక్కు లింగం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.