కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి – సీపీఐ
ఎల్కతుర్తి , ఆంధ్రప్రభ: దేశంలో చమురు ధరలు తగ్గినందున వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కార్మికుల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచడం పట్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి గత ప్రభుత్వం చేసినటువంటి సూచనలు నిబంధనలు తుంగలో తొక్కి కొత్త నిబంధనలు తీసుకోవడం పట్ల గ్రామీణ ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీకి ఎక్కువ నిధులు ఇచ్చేదని దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడినందున గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అట్టి చట్టాన్ని ఉపసంహరించుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతికూలికి కొలతతో నిమిత్తం లేకుండా 700 రూపాయలు ఇవ్వాలని పని దగ్గర వ్యవసాయ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ ఎల్కతుర్తి మండల కార్యదర్శి శనిగరపు రాజ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జూపాక రవీందర్, నాయకులు ఎర్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
