Kerala | ఇద్దరు మృతి, 50మంది కోసం రెస్క్యూ ఆపరేషన్
Kerala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో ఇవాళ భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతిచెందగా, పలువురు కార్మికులు మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జి సమీపంలో ఉన్న సొరంగం నిర్మాణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ సంస్థకు చెందిన తాత్కాలిక కార్యాలయ కంటైనర్లు, బస్సులు, కార్లు, జేసీబీ యంత్రాలు భారీగా పేరుకుపోయిన మట్టి, రాళ్ల కింద కూరుకుపోయాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 30 నుంచి 50 మంది వరకు కార్మికులు భూగర్భంలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులు కొందరు వెంటనే స్పందించి బాధితులను రక్షించి హారిసన్ మలయాళం ఎస్టేట్ ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే భారీ వృక్షాలు నేలకూలడం, సమీపంలోని చిన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ముందస్తు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద తీవ్రతపై కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు నిరంతరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
