AP | వైసిపి కి మరో షాక్ – ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజ శేఖర్ గుడ్ బై

వెలగపూడి – వైసిపి కి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసిన మర్రి.. కాసేపటి క్రితమే శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజును కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు. మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉంది. కాగా, ఇప్పటి వరకూ నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది.
అయితే.. రాజీనామాకు సిద్ధమైన రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు వైసీపీ నేతలు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. అయితే తాను నిర్ణయం తీసేసుకున్నట్లు తేల్చిచెప్పేశారు రాజశేఖర్. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ: మర్రి

శాసనమండలి లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ… ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా రాజీనామా చేసినట్లు తెలిపారు. వెంటనే ఆమోదించాలని కూడా చైర్మన్‌ను కోరానన్నారు. ఇప్పుడు చిలకలూరిపేట వెళ్లి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడాక భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆ తర్వాత రాజీనామాకు గల కారణాలపై అన్ని విషయాలు వెల్లడిస్తానని మర్రి రాజశేఖర్ తెలిపారు.

ఎమ్మెల్సీల ఒత్తిడి…

ఇదిలా ఉండగా.. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు.. చైర్మన్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళం వెంకట రమణ వైసీపీకి గుడ్‌బై చెప్పేయగా.. ఇంతవరకు వారి రాజీనామాను చైర్మన్ ఆమోదించలేదు. దీంతో ఈరోజు టీ బ్రేక్‌లో చైర్మన్‌ను కలిసిన ముగ్గురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాను ఆమోదించాలన్నారు. దీనిపై స్పందించిన చైర్మన్ త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందేనని ఎమ్మెల్సీలు పట్టుబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *