అభివృద్ధిని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు: కాంగ్రెస్
మంత్రి వివేక్ వెంకటస్వామి చేపడుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శ
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు కృత్రిమ సమస్యలు సృష్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
చెన్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నాలుగు రోజుల క్రితం చెన్నూరు మైనార్టీ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించి, విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారి ప్లేట్లలో కారం పొడి చల్లి, హాస్టల్లో విద్యార్థులకు సరైన బ్రష్‌లు అందించడం లేదంటూ కృత్రిమ ఆరోపణలు చేశారని విమర్శించారు.
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న గురుకులాల్లో ప్రభుత్వం సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి తమ రాజకీయ ఉనికి దెబ్బతింటుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
