నాలుగు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
ఉద్యోగాలను శాశ్వతీకరించి వేతనాలు పెంచాలని స్వీపర్ల సంఘం విజ్ఞప్తి
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని జడ్‌పీహెచ్‌ఎస్, యూపీఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ స్వీపర్లకు గత నాలుగు నెలలుగా నెలకు రూ.5,200 చొప్పున చెల్లించాల్సిన వేతనాలు బకాయిగా ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని స్వీపర్ల సంఘం డిమాండ్ చేసింది.
పెండింగ్ జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నామని స్వీపర్ల సంఘం అధ్యక్షుడు చిన్నారాయుడు తెలిపారు. తమ ఉద్యోగాలను శాశ్వతీకరించడంతో పాటు వేతనాలను పెంచాలని కోరారు.
జిల్లాలో సుమారు 80 మంది స్వీపర్లు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ)కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
