ఎగువన వరుణుడి జోరు.. కృష్ణా, భీమా పరీవాహకాల్లో కుండపోత
ఆల్మట్టి, ఉజ్జని జలాశయాలకు ప్రారంభమైన వరద ప్రవాహం
మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాల్లో 300 మి.మీ.లకు పైగా వర్షపాతం..
తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలపై రైతుల ఆశలు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ: కృష్ణా, భీమా నదుల ఎగువ పరీవాహక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరోసారి చురుగ్గా మారాయి. మహారాష్ట్ర పశ్చిమ కనుమల ప్రాంతాల్లో గత 24 గంటలుగా కుండపోత వర్షాలు కురవడంతో కృష్ణా, భీమా నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఈ వర్షాల ప్రభావంతో ఆల్మట్టి, ఉజ్జని జలాశయాలకు ప్రారంభ స్థాయిలో వరద జలాలు చేరడం మొదలైంది.
ముఖ్యంగా అల్మట్టిలోకి ఉధృతంగా వరద వచ్చి చేరుతుంది. కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల ప్రభావం ఇప్పుడు ఆల్మట్టి జలాశయం వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దులో దూద్‌గంగా, హిరణ్యకేశి నదులు వరద నీటితో ఉప్పొంగి కృష్ణా నదిలో కలవడంతో అక్కడ కృష్ణా నది దాదాపు 90 వేల క్యూసెక్కుల ప్రవాహంతో పరుగులు తీస్తోంది. పశ్చిమ కనుమల్లో మరో 24 గంటలు ఇదే తరహా భారీ వర్షాలు కొనసాగితే ఆల్మట్టి జలాశయంలోకి ప్రవాహం లక్ష క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే తరహా వర్షాలు కొనసాగితే కృష్ణా పరివాహకంలోని ప్రధాన జలాశయాలకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల ప్రాంతాలు ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలను నమోదు చేస్తున్నాయి. అత్యధికంగా ఖండాల ప్రాంతంలో 340 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాజిపూర్, వాకి ప్రాంతాల్లో 247 మి.మీ, భీమాశంకర్‌లో 237 మి.మీ, జోర్‌లో 231 మి.మీ, గగన్‌బావ్డాలో 190 మి.మీ, రాధానగరిలో 182 మి.మీ, మహాబలేశ్వర్‌లో ఉదయం 8 గంటల వరకు 176 మి.మీ, పతేర్‌పుంజ్‌లో 152 మి.మీ, కిట్వాడేలో 143 మి.మీ, అంబోలిలో 130 మి.మీ, చిత్రి డ్యామ్ పరిసరాల్లో 103 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షాల కారణంగా చిన్న వాగులు, వంకలు ఉప్పొంగి కృష్ణా, భీమా నదుల్లోకి చేరుతున్న నీటి పరిమాణం క్రమంగా పెరుగుతోంది. దీంతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం, మహారాష్ట్రలోని ఉజ్జని జలాశయానికి ప్రారంభ స్థాయిలో వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రవాహం భారీగా లేకపోయినా, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వచ్చే రెండు నుంచి నాలుగు రోజుల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శ్రీశైలం, తుంగభద్రపై ఆశలు
కృష్ణా ఎగువన కురుస్తున్న వర్షాలు రాయలసీమ రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆల్మట్టి జలాశయం నిండుతూ దిగువకు నీటిని విడుదల చేస్తే క్రమంగా నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి వరద జలాలు చేరే అవకాశం ఉంది. అలాగే భీమా పరీవాహకంలో వర్షాలు కొనసాగితే కృష్ణా నదిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది.
ఇటీవల వరకు వర్షాభావంతో ఖరీఫ్ సాగు ఆందోళనకరంగా మారిన కర్నూలు జిల్లాలో రైతుల చూపంతా ఇప్పుడు ఎగువ ప్రాంతాల వర్షాలపైనే ఉంది. శ్రీశైలం, తుంగభద్ర జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగితే సాగునీటి లభ్యత మెరుగుపడి వరి, ఇతర పంటల సాగుకు ఊరట లభించే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
కొనసాగితేనే పూర్తి ప్రయోజనం
ప్రస్తుతం నమోదవుతున్న వర్షాలు జలాశయాలకు ప్రారంభ స్థాయి ప్రవాహాన్ని మాత్రమే అందిస్తున్నాయి. అయితే ఒకటి రెండు రోజుల వర్షాలతోనే జలాశయాలు నిండిపోయే పరిస్థితి లేదు. పశ్చిమ కనుమల్లో మరో వారం రోజుల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగితేనే ఆల్మట్టి, ఉజ్జని, అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు గణనీయమైన వరద జలాలు చేరే అవకాశాలు ఉన్నాయి.

రైతుల్లో పెరుగుతున్న ఆశావాదం
గత కొన్ని వారాలుగా వర్షాభావంతో పత్తి, వేరుశనగ, మిరప, ఉల్లి పంటలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రైతుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. వరద జలాలు క్రమంగా దిగువకు చేరి సాగునీటి పరిస్థితి మెరుగుపడితే ఖరీఫ్ సీజన్‌కు కొంత మేర ఊరట లభించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణ ఎగువన భారీ వర్షపాతం నమోదైన ప్రాంతాలు
ఖండాల – 340 మి.మీ
దాజిపూర్, వాకి – 247 మి.మీ
భీమాశంకర్ – 237 మి.మీ
జోర్ – 231 మి.మీ
గగన్‌బావ్డా – 190 మి.మీ
రాధానగరి – 182 మి.మీ
మహాబలేశ్వర్ – 176 మి.మీ
పతేర్‌పుంజ్ – 152 మి.మీ
కిట్వాడే – 143 మి.మీ
అంబోలి – 130 మి.మీ
చిత్రి డ్యామ్ – 103 మి.మీ
ఆల్మట్టి నిండితేనే శ్రీశైలానికి ఊపు
కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద జలాలకు తొలి ప్రధాన నిల్వ కేంద్రం. అక్కడికి ప్రవాహం పెరిగి, నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరిన తర్వాతే దిగువన ఉన్న నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి గణనీయమైన వరద జలాలు చేరుతాయి. అందుకే ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలు రాయలసీమ రైతులకు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం ప్రారంభమైన ఈ ప్రవాహం రాబోయే రోజుల్లో మరింత పెరగాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
