పెద్ద చెరువు అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభం…

పెద్ద చెరువు అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభం…

ప్రజలకు 2.5 కి.మీ. వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి…
గ్రీనరీ, పగోడాలతో చెరువు సుందరీకరణ..
700 ఎకరాల చెరువు నంద్యాలకు కీలక ఆస్తి..
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. గురువారం వాటర్ రిసోర్సెస్ శాఖ అధికారులతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువు చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాక్‌ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు పరిసరాల్లో గ్రీనరీని పెంపొందిస్తూ, షేడ్ పగోడాలు ఏర్పాటు చేసి అందమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చెరువు కట్టను ఆక్రమణల నుంచి రక్షించేందుకు బౌండరీ ఫిక్సింగ్, ఫెన్సింగ్, ట్రెంచెస్ ఏర్పాటు చేయాలని సూచించారు.

చెరువు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కట్టను శాశ్వతంగా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే సివిల్ పనులను పూర్తి చేసి, వర్షాలు ప్రారంభమైన వెంటనే విస్తృతంగా మొక్కలు నాటి గ్రీనరీని పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పాలేరు వాగు, చామ కాలువలతో అనుసంధానమై సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తే, నంద్యాల పట్టణానికి ఒక విలువైన ఆస్తిగా మారుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శివ శంకర్ రెడ్డి, కేసి కెనాల్ డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply