ప్రీ-ప్రైమరీ పాఠశాల ప్రారంభం.. విద్యార్థులతో సందడి

నిజాంపేట, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని కాసింపూర్ తాండ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం గ్రామ సర్పంచ్ లౌడ్య రామచందర్ నాయక్, మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రీ-ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం యూకేజీ, మొదటి తరగతి విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో గ్రామానికి ప్రీ-ప్రైమరీ పాఠశాల మంజూరైందని తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామంలోని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపకుండా గ్రామంలో తీర్మానం చేయడం అభినందనీయమని మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే సంకల్పంతో గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి సహకరించి ప్రభుత్వ విద్యను మరింత ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం మాధురి దేవి, ఉప సర్పంచ్ రమేష్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వార్డు సభ్యుడు రాజు, ప్రధానోపాధ్యాయుడు సంపత్, ఉపాధ్యాయులు వినోద్, నాగలక్ష్మి, గ్రామ అధ్యక్షుడు గోపాల్, గ్రామస్తులు కిషన్, లచ్చిరాం, మొతిరాం, మోహన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.