భవనంపై నుంచి పడి చిన్నారి దుర్మరణం
చేవెళ్ల, ఆంధ్రప్రభ: అప్పటివరకు కళ్ల ముందే ఆడుకుంటూ కనిపించిన చిన్నారి.. క్షణాల్లోనే విగతజీవిగా మారాడు. రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యంలోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాద ఘటనతో మాల్కపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చేవెళ్ల మున్సిపల్ పరిధి మాల్కపూర్ గ్రామానికి చెందిన శేరి సురేందర్ రెడ్డి, శేరి శ్రీజ దంపతుల కుమారుడు శేరి సాయి ప్రియాంశ్ రెడ్డి (5) బుధవారం సాయంత్రం ఇంటి భవనంపై ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనానికి ఏర్పాటు చేసిన గాజు రేలింగ్ ఒక్కసారిగా పగిలిపోవడంతో బాలుడు అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే చేవెళ్ల పట్టణంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలకు తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేయగా, గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.
