విమర్శించండి.. కానీ హద్దులు దాటొద్దు: పవన్ కళ్యాణ్

  • వాక్ స్వాతంత్య్రం పేరుతో దూషణలు కుదరవు..
  • వ్యక్తిత్వ హననం చేస్తే చర్యలు తప్పవు..
  • మత విశ్వాసాలను అవమానిస్తే కఠిన చర్యలు..
  • సోషల్ మీడియా దుర్వినియోగంపై పవన్ హెచ్చరిక

ఆంధ్రప్రభ, అమరావతి : వాక్ స్వాతంత్య్రం (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) అంటే ఇతరులను దూషించే హక్కు కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వ్యక్తిత్వ హననం, మత విశ్వాసాలను దెబ్బతీయడం, బెదిరింపులకు పాల్పడడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వాన్ని విమర్శించడం, విధానాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే మహిళలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను కించపరుస్తూ మాట్లాడడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వ్యవస్థీకృతంగా వేధించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని అన్నారు.

మమ్మల్ని విమర్శించండి… కానీ గౌరవంతో, చట్టబద్ధంగా విమర్శించండి. ఎలా పడితే అలా మాట్లాడతామంటే చట్టపరమైన చర్యలు తప్పవు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మత విశ్వాసాలను అవమానించడం, దేవుళ్లు, దేవతలపై ఉద్దేశపూర్వకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కూడా సహించబోమని చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడం సమంజసం కాదన్నారు.

సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురయ్యే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.