తెలంగాణలో స్మార్ట్ మౌలిక సదుపాయాలపై ఫోకస్..

  • సీఎం రేవంత్‌తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల భేటీ
  • అనలాగ్–ఎంఈఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం..
  • హైదరాబాద్‌కు ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ ప్రతిపాదన

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : హైదరాబాద్‌ను అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘కాగ్నిటివ్ సిటీ’గా అభివృద్ధి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణలో తదుపరి తరం స్మార్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మన్, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పి. కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లోని బోధి పేవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో సాంకేతికత ఆధారిత పట్టణాభివృద్ధి, స్మార్ట్ మౌలిక సదుపాయాల నిర్మాణం, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంతో నగరాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు.

సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, సీనియర్ అధికారి బి. అజిత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంస్థలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. భౌతిక మేధ (ఫిజికల్ ఇంటెలిజెన్స్) ఆధారిత తదుపరి తరం స్మార్ట్ మౌలిక సదుపాయాలపై సంస్థలు తమ ప్రణాళికలను ముఖ్యమంత్రికి వివరించాయి.

సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్ , ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణలతో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఏఐ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్..

హైదరాబాద్ నగరంలో ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలన్న ప్రతిపాదన కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, రవాణా నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చడం, ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కల్పించడం లక్ష్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రతిపాదిత ఏఐ ఆధారిత ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టుపై కూడా సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయి. సెన్సర్లు, రోబోటిక్స్, డేటా ఆధారిత వ్యవస్థలతో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, నీటి లీకేజీలను గుర్తించడం, విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం, అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలు వేగంగా వెళ్లేలా ట్రాఫిక్‌ను నియంత్రించడం వంటి అంశాలను వివరించాయి.

ఈ సాంకేతికతతో నగర రవాణా వ్యవస్థ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారడంతో పాటు ప్రజా సేవల నిర్వహణ, పాలనలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సంస్థల ప్రతినిధులు తెలిపారు.

సీఎం సూచనలు..

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లోని అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఒకే వ్యవస్థతో అనుసంధానించాలని, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఆటోమేటిక్ గా సిగ్నళ్లు మారే అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ నియంత్రించేలా కృత్రిమ మేధ (ఏఐ)తో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.

సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్, ఎంఈఐఎల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసి, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.