రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలం

తొర్రూరు, ఆంధ్రప్రభ : ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని మాజీ జెడ్పిటిసి,ఎంపీపీలు మంగళపల్లి శ్రీనివాస్,తూర్పాటి చిన్న అంజయ్యలు విమర్శించారు. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల,పట్టణ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కోటా వరకు మాత్రమే పంటలు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రైతులకు మరణశాసనం వంటిదని మండిపడ్డారు.

వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతు బతుకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టాల్లోకి నెడుతోందని విమర్శించారు.పదేళ్ల పాటు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో జీవించిన తెలంగాణ రైతులను మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి దుస్థితిలోకి నెట్టారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి రైతుల కష్టాలు, కన్నీళ్లు ప్రధాన కారణమని గుర్తుచేశారు.కేసీఆర్ నాయకత్వంలో మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంచారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని తెలిపారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిందీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

2021లో రైతు దీక్ష సందర్భంగా అన్ని పంటలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం లక్ష్యంగా పెట్టిన మేరకే పంటలు కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అవసరం ఏమిటని నిలదీశారు.రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను మోసం చేసే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో పాటు వర్షాలకు దాన్యం తడిచి రైతులు అల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అమెరికాకు వెళ్లడం బాధాకరమన్నారు. రైతులు పండించే ప్రతి పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్ పేర్ల జంపన్న,టిఆర్ఎస్ నాయకులు బిందు శ్రీనివాస్, నల్లమాస ప్రమోద్, అంకుష్, ప్రదీప్ రెడ్డి,కాలు నాయక్, కుర్ర శ్రీనివాస్, జై సింగ్, కర్నె నాగరాజు, రాయిశెట్టి వెంకన్న,జాటోత్ బాలు నాయక్, స్వామి నాయక్, మాచర్ల వెంకన్న, సురేష్ నాయక్, కొండ వెంకన్న,గద్దల బిక్షపతి, ఆశయ్య,డి.బాలు నాయక్, రమేష్ నాయక్, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.