Telangana | కొత్త ఓటరు నమోదుకు అవకాశం లేదన్న ప్రచారం అవాస్తవం
Telangana | కొత్త ఓటరు నమోదుకు అవకాశం లేదన్న ప్రచారం అవాస్తవం
Telangana | ఆంధ్రప్రభ, హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త ఓటరు నమోదుకు అవకాశం లేదంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
హైదరాబాద్‌లో శనివారం మీడియాతో మాట్లాడిన సుదర్శన్‌రెడ్డి, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని వెల్లడించారు. జూలై 25లోపు ఆ ఫారాలను సమర్పించాలని సూచించారు. అదే ఫారం ద్వారా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను కూడా గుర్తింపు ఆధారాలుగా అనుమతిస్తామని చెప్పారు. 2002లోపు ఓటరు జాబితాతో అనుసంధానమైన వారికి అదనపు పత్రాల అవసరం ఉండదని వెల్లడించారు.
బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం కూడా జరుగుతోందని తెలిపారు. బీఎల్వోలు సేకరించే వివరాలను ముసాయిదా ఓటరు జాబితాలో పొందుపరుస్తామని చెప్పారు.
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేసే వరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో కూడా సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.
