వైద్యం వికటించి బాలిక మృతి… డాక్టర్ సస్పెండ్ !
- గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై కలెక్టర్ ఉత్తర్వులు
జోగులాంబ గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన 17 ఏళ్ల విద్యార్థిని ఇందు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో… నిర్వహించిన విచారణలో బాధ్యత నిర్ధారణ కావడంతో ఓ వైద్యుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు కడుపు నొప్పితో బాధపడుతూ జూన్ 6న గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అనంతరం అపెండిసైటిస్ సమస్యకు శస్త్రచికిత్స నిర్వహించగా, జూన్ 7న ఆపరేషన్ అనంతరం కొద్ది గంటల్లోనే ఆమె మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే బాలిక ప్రాణాలు తీసిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్వతంత్ర విచారణ కమిటీని నియమించారు. కమిటీ విచారణ పూర్తి చేసి ఈ నెల 13న నివేదికను కలెక్టర్‌కు సమర్పించింది. అనంతరం కేసును మెడికల్ ఎగ్జామినేషన్ డైరెక్టర్‌కు రీ-ఎంక్వైరీ కోసం పంపించారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ మాలిమ్ అర్షద్‌ను బాధ్యుడిగా నిర్ధారించారు. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై వైద్య వర్గాల్లో చర్చ జరుగుతుండగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
