Bheemgal | మహిళా సంఘాలకు శాశ్వత భవనం.. నిర్మాణ పనులు ప్రారంభం
- రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణం
- మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: సర్పంచ్ వసుంధర్
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సుదర్శన్‌నగర్ తండా సర్పంచ్ వసుంధర్ అన్నారు. భీమ్‌గల్ మండలం సుదర్శన్‌నగర్ తండాలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా భవన నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, మహిళా సంఘాల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మహిళా సంఘాల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా భవనాల నిర్మాణం చేపట్టడం ప్రభుత్వం వారికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని అన్నారు.
మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. శాశ్వత భవనాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సంఘాల కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
