19thJunechintana | క్రోధం వల్ల కలిగే నష్టాలపై త్యాగయ్య బోధన
19thJunechintana | క్రోధం వల్ల కలిగే నష్టాలపై త్యాగయ్య బోధన
19thJunechintana | శాంతం, సౌఖ్యం ఒకే నాణానికి రెండు వైపులు
‘శాంతము లేక సౌఖ్యము లేదు’ కీర్తన వెనుక ఆసక్తికర ఘటన
శాంత స్వభావమే జీవిత విజయానికి మార్గం
19thJunechintana | “శాంతము లేక సౌఖ్యము లేదు – సారస దళ నయనా” అంటూ సాగే కీర్తన ఎవరు రాశారు అని కొంతైనా జ్ఞానం ఉన్నవారిని అడిగితే, వెంటనే త్యాగరాజు అని సమాధానం చెబుతారు. కొన్ని కీర్తనలు అన్నమయ్యకు, త్యాగయ్యకు, రామదాసుకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే కృష్ణభక్తుడైన వల్లభాచార్యులు రచించిన “నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ అధరం మధురం” అంటూ సాగే కీర్తన ఆయనను గుర్తు చేస్తూ ఉంటుంది.
ఇంతకీ త్యాగరాజుగారికి పేరుతెచ్చిన కీర్తనలలో “శాంతము లేక సౌఖ్యము లేదు” ఒకటి. ఇందులో రెండు ప్రధాన పదాలు ఉన్నాయి. అవి – 1) శాంతము, 2) సౌఖ్యము. ఆయన చెప్పిన సందేశం ఏమిటంటే, శాంతం లేకపోతే సౌఖ్యం ఉండదు. మానవాళి అంతా సౌఖ్యాలను కోరుకుంటూ ఆరాటపడుతుంటారు. కానీ శాంతిని పొందడానికి ఏమి చేయాలో, ఏ మార్గాన్ని అనుసరించాలో ఆచరించరు. అయితే సౌఖ్యం మాత్రం కావాలని కోరుకుంటారు.
శాంతము, సౌఖ్యము రెండూ ఒకే నాణానికి బొమ్మ, బొరుసుల వంటివి. ఎందుకంటే శాంతం లేకపోతే సౌఖ్యం ఉండదు. శాంతానికి వ్యతిరేకంగా క్రోధం నిలబడి ఉంటుంది. మనలో చాలామంది క్రోధం వలలో చిక్కుకుని అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. క్రోధం వల్ల ఇతరులపై నేరారోపణలు చేయడం, పగతో, ప్రతీకార భావంతో రగిలిపోవడం, తనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి ఈర్ష్య, ద్వేషాలకు లోనవడం జరుగుతుంది. ముఖ్యంగా వివేకాన్ని కోల్పోతారు.
“ఉత్తమే క్షణకోపః స్యాత్, మధ్యమే ఘటికా ద్వయం, అధమే స్యాదహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకం” అని శాస్త్రం చెబుతోంది. అంటే ఉత్తములకు కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. మధ్యస్థులకు రెండు ఘడియలపాటు ఉంటుంది. అధములకు ఒక రోజు పాటు ఉంటుంది. పాపాత్ములకు మరణించే వరకు కోపం విడిచిపోదు.
త్యాగయ్య ఆ కీర్తన రాయడానికి ప్రేరణ
ఏ పని చేయాలన్నా ప్రేరణ అవసరం. ఒకసారి త్యాగరాజు తిరుమల సందర్శించిన సమయంలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి తెర అడ్డుగా ఉంది. వెంటనే త్యాగయ్య “తెరతీయగ రాదా వేంకటరమణా, నా లోని మత్సరము” అంటూ కీర్తన ఆలపించగా, స్వామివారి దర్శనభాగ్యం కలిగిందని చెబుతారు.
మరోసారి త్యాగరాజుగారి భార్య ఎండలో పప్పులు ఎండబెట్టింది. ఆ సమయంలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ పప్పులపై పడి వాటిని చెల్లాచెదురు చేశారు. ఇది చూసిన త్యాగయ్య కోపంతో పిల్లలపై కేకలు వేస్తుండగా, ఆయన భార్య వచ్చి, “మీరు రామభక్తులు కదా! జ్ఞానవంతులు కదా! పొరపాటున పిల్లలు తప్పు చేశారనుకోండి. అంత కోపం ఎందుకు? మీ శాంతం ఏమైపోయింది?” అని ప్రశ్నించింది.
ఆ మాటలు విన్న త్యాగయ్య తన పొరపాటును గ్రహించారు. సాయంత్రం భగవంతుని సేవ చేస్తూ “శాంతము లేక సౌఖ్యము లేదు, సారస దళ నయనా” అంటూ ఆ ప్రసిద్ధ కీర్తనను ఆలపించారు. ఒకసారి క్రోధం శాంతం దగ్గరకు వెళ్లింది. అప్పుడు శాంతం చిరునవ్వుతో పలకరించింది. క్రోధం మాత్రం ఆవేశంతో కళ్లు, ముఖం ఎర్రబార్చుకుంది. శాంతం “శుభమస్తు” అని పలికింది. క్రోధం రెచ్చిపోయి తన కఠినమైన మాటలతో శాంతంపై దాడి చేసింది. అప్పుడు శాంతం, “ఈ రోజు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. లేకపోతే నా శత్రువు బలహీనపడుతున్నాడు” అని చెప్పింది. ఆ మాటలకు క్రోధం ఓడిపోయి పారిపోయింది.
శాంతం క్రోధాన్ని జయించగలదు. “తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష; దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము అండ్రు తథ్యము సుమతీ” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పారు. శాంత స్వరూపంతో విరాజిల్లుతున్న పరమాత్మను “శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం” అంటూ ప్రార్థిస్తాము. తనను ప్రేమిస్తున్నా, ద్వేషిస్తున్నా భగవంతుడు సమభావంతోనే చూస్తాడు. కాబట్టి మనసును నిర్మలంగా ఉంచుకొని, శాంత స్వభావాన్ని అలవరచుకొని, జ్ఞానంతో జీవించడం మన కర్తవ్యం.
– అనంతాత్మకుల రంగారావు
