రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా… యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం. రామ అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదరో అతడే రాముడు అని. శ్రీరామనవమి రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని తర్వాత నమ: అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి. పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే స#హస్ర నామతత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
భారతీయ జనజీవన స్రవంతిలో ఇంత బలీయంగా పెనవేసుకుపోయిన మహనీయుడు మరియొకడు లేదు. అందుకే భారత దేశంలో పట్టుమని పది ఇండ్లు కూడా లేని పల్లెల్లో సహితం ఒక రామ మందిరం నిర్మితమై వుంది. మూర్తీభవించిన ధర్మమే రాముడు. రాముడే ధర్మం అని. ధర్మం ఒక భౌతిక రూపం ధరించి రాముడు అయింది. రాముడే ధర్మం కాబట్టి రాముడి ప్రవర్తనలో ధర్మ బాహ్యమైనది ఎంత మాత్రమూ ఉండదు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజేవేద: ప్రాచేతసాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదము చేత తెలియబడే వాడయిన పరమాత్మ దశరథ పుత్రుడుగా పుట్టగా వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా అవతరించింది. ”మానవరూపం దాల్చిన ధర్మమే” రాముడు అని తెల్పుతూ వాల్మీకి ”రామోవిగ్రహ వాన్ ధర్మ: సాధుస్సత్య పరాక్రమ:” రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసత:|| దేవతలకు ఇంద్రుని వలె, సమస లోకాలకు రాముడే ప్రభువు అని కీర్తిస్తాడు. ధర్మాదర్భ: ప్రభవతి ధర్మాత్ ప్రభవతీ సుఖమ్, ధర్మేణల భతే సర్వం ధర్మసార మిదంజగత్” అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ స్వరూపమే అని ఋషివాక్యం ”ధరతివిశ్వం ధర్మ:” ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ”సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం” సత్య ధర్మాలన్ను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. కనుక ధర్మాన్ని అందరూ ఆచరించాలి అని రామాయణం మనకి బోధిస్తుంది. పితృవాక్య పరిపాలన, పుత్ర, మిత్ర, కళత్ర, భాత సమాదరణ, శరణాగత రక్షణ, శత్రునిర్మూలన వంటి ధర్మాలనెన్నింటినో శ్రీరాముని జీవిత చిత్రణలో మనం చూడవచ్చు. విభీషణుడు శరణాగతుడైరాగా, వానరులు సంశయం వెలిబుచ్చగా శరణాగత ధర్మాన్ని తెల్పుతూ ”సకదేవప్రసన్నాయత వాస్మీతి చయాచతే| అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతంమమ|| ఒక్కసారి ”శరణు” అని ఆశ్రయించిన వారిని రక్షించడమే
నా వ్రతం అని, విభీషణుడికి అభయం యిస్తాడు. రావణుని మరణానంతరం అగ్ని సంస్కారం చేయమని విభీషణుడికి బోధిస్తూ ”మరణాంతాని వైరాణి ఎంత శతృత్వమైనా మరణంతో పోతుంది” అని విశదపరుస్తాడు. ”యతో భ్యదయని శేశ్రీయ ససిద్ధ³ి: సధర్మ:” ఇ#హలోక పరలోకములందు కూడా మంచిని చేకూర్చునదే ధర్మము ఇట్టి ధర్మస్వరూపాన్ని రాముని ద్వారా లోకానికి చాటినది రామాయణం భారతీయుల సచ్చీలతకు, సంప్రదాయానికి, సత్ప్రవర్తనకు మణిదర్పణం రామాయణం చదివి ధర్మాన్ని ఆచరించడం మన ధర్మం. రాముడు ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ప్రజలు రామ మార్గాన్ని అనుసరించి ”యధారాజా తధా ప్రజా:” అన్న విధంగా ప్రవర్తించేరని తెల్పి, రాముని వలె అందరూ ధర్మాన్ని ఆచరించాలని బోధిస్తాడు వాల్మీకి. ధర్మరహితమైన కాలాన్ని కోరుకుంటే దశరధుడు, దశకంఠుని వలె నశిస్తారని ఉపదేశిస్తుంది రామాయణం. అందుకనే ”రామతత్ వర్తితత్యం, నరావణవత్.” అని పెద్దలు తెల్పేరు, కావున ప్రతి వ్యక్తి ధర్మంతో కూడిన అర్ధాన్ని ధర్మంతో కూడిన కాలాన్ని కోరుకోవాలి. సదాధర్మాన్ని కాపాడాలి.
- వాడవల్లి శ్రీధర్