రైతు భరోసా ఈసారైనా వస్తుందా..?

  • పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతన్న
  • ఖరీఫ్ ప్రారంభమైనా జమ కాని రైతు భరోసా
  • వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఒకవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, మరోవైపు రైతు భరోసా నిధులు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జిల్లాలో 1,44,511 మంది రైతులు ఉండగా, సుమారు రూ.268 కోట్లకు పైగా రైతు భరోసా పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. అయితే నిధుల విడుదలలో జాప్యం కారణంగా రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని 15 మండలాల పరిధిలో 560 గ్రామాలు ఉండగా, పత్తి, కంది, వరి, సోయాబీన్, పెసర తదితర పంటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా విత్తనాల విత్తకం ఆలస్యమవుతోంది. జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇప్పటివరకు సుమారు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు సమాచారం.రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు చేసినప్పటికీ రైతుల ఖాతాల్లో సకాలంలో జమ కాకపోవడంతో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

ఇదే అదనుగా కొందరు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు, వ్యవసాయ సామగ్రి అందిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు యూరియా పంపిణీ కోసం యాప్ ఆధారిత విధానం అమలు చేయడంతో మారుమూల గ్రామాల రైతులు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కౌలు రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది.గతంలో రైతుబంధు నిధులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ అయ్యేవని, ప్రస్తుతం రైతు భరోసా నిధులు విడతల వారీగా విడుదల కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు.ఈ విషయమై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. వెంకటను సంప్రదించగా, రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు.