ప్రజల నమ్మకమే నన్ను సీఎం చేసింది : రేవంత్ రెడ్డి
ఆంధ్రప్రభ : వనమహోత్సవ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేసిన సమయంలో తనను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రజలు విశ్వాసం ఉంచి గెలిపించారని చెప్పారు. ప్రజల మద్దతే తన రాజకీయ జీవితానికి బలమని, ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీనగర్ ప్రజలు సుమారు 30 వేల ఓట్ల భారీ మెజార్టీ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చేసిన పోరాటాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిందని, అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం మరింత బలపడిందని వివరించారు. ప్రజల అండదండల వల్లే తాను ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఎదురైన ఓటమిని కూడా రేవంత్ ప్రస్తావించారు. ఆ సమయంలో తన రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయిందని చాలామంది భావించారని, అయితే ప్రజల విశ్వాసమే తనకు తిరిగి నిలబడే ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రజల ప్రేమ, మద్దతుకు గుర్తుగానే ఎల్బీనగర్ ప్రజలకు అంకితంగా 424 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో ఎకో పార్క్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
