టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
- డీఐఈటీలో 86 లెక్చరర్ పోస్టుల భర్తీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డీఐఈటీ)లో లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 86 ఖాళీలను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనుంది.
ఈ నియామకాల్లో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు వివిధ సబ్జెక్టుల్లో ఉన్నాయి. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది.
అభ్యర్థులు జూన్ 24, 2026 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు జూలై 29, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్లైన్ విధానంలోనే స్వీకరిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
అర్హతలు, వయోపరిమితి
జూలై 1, 2026 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తించనుంది.
దరఖాస్తు విధానం
టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
డీఐఈటీ లెక్చరర్ రిక్రూట్మెంట్-2026 నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ప్రాథమిక వివరాలతో నమోదు చేసుకుని లాగిన్ క్రెడెన్షియల్స్ సృష్టించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాలి.
అవసరమైన ధ్రువపత్రాలు, ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేయాలి.
అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
దరఖాస్తును సమర్పించి భవిష్యత్ అవసరాల కోసం కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలని టీజీపీఎస్సీ సూచించింది.
