సీఎంఆర్ఎఫ్‌తో మరోసారి అండగా నిలిచిన ప్రభుత్వం

సీఎంఆర్ఎఫ్‌తో మరోసారి అండగా నిలిచిన ప్రభుత్వం

రూ.33.29 లక్షల చెక్కులు, రూ.8.41 లక్షల ఎల్‌వోసీ కాపీలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: పేదల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అదే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

ఏలూరు పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33,29,284 విలువైన 40 చెక్కులను పంపిణీ చేశారు.

అదేవిధంగా రూ.8,41,404 విలువైన మూడు ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) కాపీలను బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారికి భరోసా కల్పిస్తూ అన్ని విధాలా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ నాయకత్వం సూచనల మేరకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటివరకు నియోజకవర్గంలో 702 మంది లబ్ధిదారులకు రూ.6,16,17,516 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు.

అలాగే ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, సేవా కార్యక్రమాల ద్వారా రూ.1.50 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని పేదలకు అందజేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, డివిజన్ ఇన్‌చార్జిలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.