యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం

  • రైతులు నేరుగా యూరియా బుక్ చేసుకునే అవకాశం
  • యూరియా పంపిణీలో పారదర్శకత, సులభతర సేవలే లక్ష్యం
  • జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లాలో రైతులకు యూరియా పంపిణీలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, ఎరువుల కోసం పడే ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, జిల్లాలోని 20 మండలాల్లో ఈ సేవలను నేటి నుండి ప్రారంభించగా, రైతులు ఇకపై నేరుగా తమ మొబైల్ ఫోన్ ద్వారా యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు.

గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో హాకా, ఆగ్రోస్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, క్రిమిసంహారక మందుల విక్రయ కేంద్రాల డీలర్లతో యూరియా పంపిణీ, యూరియా నిల్వలు, యాప్ ఆధారిత బుకింగ్ విధానం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యుడు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి చేతుల మీదుగా యూరియా బుకింగ్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం యాప్ పనితీరు, రైతులకు అందించే సేవలు, బుకింగ్ విధానం గురించి అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు యాప్ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. యూరియా బుకింగ్ ప్రక్రియను రైతులకు సులభంగా వివరించి, ప్రతి రైతు సాంకేతిక సేవలను వినియోగించుకునేలా సహకరించాలని ఆయన సూచించారు.

యాప్ ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ సేవలను విజయవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే యూరియా నిల్వలను సిద్ధం చేసిందని ఎమ్మెల్సీ తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా యూరియా సరఫరాపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, రైతులకు కొరత రాకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. అవసరమైన మేరకు యూరియా నిల్వలను సమకూర్చి రైతుల అవసరాలను తీర్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ…., రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా పంపిణీ జరగడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా వాటిని సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులకు ప్రాధాన్యతనిస్తూ, వారికి ఎరువులు సులభంగా అందే విధంగా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు.

యాప్ ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా యూరియాను ముందుగానే బుక్ చేసుకోవచ్చని, దీంతో ఎరువుల కోసం డీలర్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. యాప్ ద్వారా నమోదైన వివరాల ఆధారంగా యూరియా పంపిణీ చేపట్టడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు కూడా అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.

జిల్లాలో యూరియా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు డిజిటల్ విధానాలను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైతులు యాప్‌ను సద్వినియోగం చేసుకొని ముందస్తుగా యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, జిల్లా సహకార అధికారి రఘునాథ్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అశోక్, హర్షవర్ధన్, మండల స్థాయి వ్యవసాయ అధికారులు, హాకా, ఆగ్రోస్ ప్రతినిధులు, సహకార సంఘాల అధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.