వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలు పెంపొందించాలి

  • భూగర్భ జలాల పరిరక్షణకు విద్యార్థులే దూతలు
  • మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య

మోత్కూర్, ఆంద్రప్రభ: క్యాచ్ ది రైన్ నినాదంతో ఇంకుడు గుంతల ఆవశ్యకత, భూగర్భ జలాల సంరక్షణ, నీటి పునర్వినియోగం అంశాలపై మోత్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవడం ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని తెలిపారు. నీటి వృథాను నివారించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు.

విద్యార్థులు నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని, అలాగే ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని వాటిని సంరక్షించాలని, తమ కుటుంబ సభ్యులను కూడా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద రాయుడు, కౌన్సిలర్ కుర్మిల్ల ప్రమీల రాములు, మున్సిపల్ ఇంచార్జి మేనేజర్ షాబాజ్, పట్టణ ప్రణాళిక అధికారి వెంకటేష్, శ్రవణ్, నిఖిల్, కిరణ్, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.