ఫీజుల దోపిడి..
ఫీజుల దోపిడి..
డమ్మీ భవనాల ఆరోపణలు! కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్
నందికొట్కూర్ ఆంధ్రప్రభ : రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో నడుస్తున్న శ్రీ షిరిడీ బాబా విద్యా శిక్షణ కళాశాలపై అఖిల భారత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి డక్క కుమార్, ఆంధ్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక విద్యార్థి సంఘాల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ కళాశాల యాజమాన్యం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ విద్యను వ్యాపారంగా మార్చేసిందని ఆరోపించారు.
విశ్వవిద్యాలయ అనుబంధం తనిఖీల సమయంలో మాత్రమే నామమాత్రంగా అద్దె భవనాలు, డమ్మీ ప్రయోగశాలలు, గ్రంథాలయాన్ని చూపించి అనుమతులు దక్కించుకుంటున్నారని, కానీ తనిఖీలు పూర్తయ్యాక కళాశాలకు తాళం వేస్తున్నారని విమర్శించారు.
విద్యా శిక్షణ కళాశాలకు ఉండాల్సిన సొంత భవనాలు, తరగతి గదులు, గ్రంథాలయం, ప్రయోగశాలలు వంటి మౌలిక వసతులు వాస్తవంగా లేవని, ఉన్నా అవి పేరుకు మాత్రమే ఉన్నాయని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రధానాచార్యుడు, అధ్యాపకులు లేకుండానే కనీస విద్యా ప్రమాణాలు కూడా పాటించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
ఫీజులు వసూలు చేసిన తర్వాత తరగతులను సక్రమంగా నిర్వహించకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా చూస్తూ వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసి పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు.
అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లను బహిరంగంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు.
వెంటనే రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రత్యేక కమిటీని నియమించి కళాశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమాలు రుజువైతే శ్రీ షిరిడీ బాబా విద్యా శిక్షణ కళాశాల గుర్తింపును తక్షణమే రద్దు చేసి, యాజమాన్యంతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో కళాశాల ఎదుట, అలాగే రాయలసీమ విశ్వవిద్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అశోక్, చింటు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
