ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

ఏఐ, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

తొర్రూరు టౌన్,ఆంధ్రప్రభ: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్న-అక్క మెంటార్‌షిప్ కార్యక్రమంలో భాగంగా “టీచింగ్ ఇంటర్న్‌షిప్ ఆన్ ఏఐ & డిజిటల్ లెర్నింగ్” అంశంపై రెండు రోజుల మెంటార్స్ విద్యార్థుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు అన్ని రంగాల్లో ఏఐ, డిజిటల్ లెర్నింగ్ అత్యవసరమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పాఠశాల విద్యార్థులకు బోధించడంతో పాటు, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల కోసం కూడా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ శిక్షణ పొందిన నోడల్ ఆఫీసర్లు ఐదో సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు మరోసారి శిక్షణ అందజేస్తారు. అనంతరం జూలై 1 నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారు నేర్చుకున్న ఏఐ అంశాలను బోధిస్తారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శాంతకుమార్, రిసోర్స్ పర్సన్ జి. కళ్యాణి, తొర్రూరు డిగ్రీ కళాశాల నోడల్ ఆఫీసర్లు వై. రవీంద్రారెడ్డి, ఆర్. సునీల్ కుమార్, ఎస్. శ్రీనివాస్, మహబూబాబాద్ డిగ్రీ కళాశాల నోడల్ ఆఫీసర్లు వి. సాంబశివరావు, ఎం. సుమన్, ఎస్‌కే. ఖాసిం, అధ్యాపకులు, రెండు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.