అచ్చంపేటలో కలకలం.. పోతురాజు విగ్రహం ధ్వంసం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని పోచమ్మ ఆలయంలో ఉన్న పోతురాజు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విగ్రహం ధ్వంసానికి సంబంధించిన వివరాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆలయ భక్తులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

