తాడూరు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల వెల్లువ
తాడూరు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల వెల్లువ
- బడిబాటలో 40 మంది కొత్త చేరికలు
- ఘనంగా అక్షరాభ్యాసం – ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న తల్లిదండ్రుల నమ్మకం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: ఉప్పునుంతల మండలం లోని తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించగా, నూతనంగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు జటపోలు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అలివేల ఎల్లయ్య, ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, గ్రామ పెద్దలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్క రామస్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల నుంచి 40 మంది విద్యార్థులు తాడూరు ప్రభుత్వ పాఠశాలలో చేరడం విశేషంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, గుణాత్మక బోధనతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్క రామస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జ్ఞానాత్మకంగా, మానసికంగా ఎదిగి భవిష్యత్తులో జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంటారని తెలిపారు.
విద్యార్థులను విద్య, సంస్కృతి, సామాజిక విలువల పరంగా ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ బృందం బాధ్యతతో పనిచేస్తోందని చెప్పారు. గ్రామ ఉపసర్పంచ్ అశోక్ గౌడ్ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చి ఆదర్శంగా నిలిచారని ప్రధానోపాధ్యాయులు అభినందించారు. గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతయ్య యాదవ్, శ్రీకాంత్, చంద్రయ్య, కృష్ణయ్య తదితర గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
