Rainbow-Hospital-Fire : చిన్నారులు సేఫ్ Andhra PtaBha Top News
- రెయిన్బో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..
- ఎమర్జెన్సీ వార్డు పూర్తి గా దగ్ధం
- షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు..
- హుటాహుటిన రంగంలోకి అగ్నిమాపక, పోలీసు సిబ్బంది
- పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆసుపత్రి సిబ్బంది
- ఫైర్ డిటెక్ట్ ఆటో సెన్సార్లతో తప్పిన భారీ ప్రమాదం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పటమట పోలీసులు
(విజయవాడ, ఆంధ్రప్రభ )

Rainbow-Hospital-Fire : విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఆ విభాగం పూర్తిగా దగ్ధమైనాయి. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను మరో వార్డుకు సురక్షితంగా తరలించారు. దీంతో ప్రాణనష్టం జరగకుండా తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫైర్ డిటెక్ట్ ఆటో సెన్సార్లు పనిచేయడంతో వెంటనే హెచ్చరికలు అందాయి. దీంతో సిబ్బంది వేగంగా స్పందించి పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్నిప్రమాదంతో ఎమర్జెన్సీ వార్డులోని వైద్య పరికరాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైనట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నష్టం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
