Thorrur ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

Thorrur ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

17 దరఖాస్తుల స్వీకరణ

తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తొర్రూరు ఆర్డీవో గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని స్థానికుల నుంచి మొత్తం 17 దరఖాస్తులు అందాయి. వాటిలో 12 రెవెన్యూ శాఖకు, 5 పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట మండలాలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్డీవో గణేష్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

ఇదే సమయంలో వలిగొండ–కొత్తగూడెం జాతీయ రహదారి నిర్మాణం కారణంగా తమ భూములు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తొర్రూరు మండల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది స్థానికులు 2011లో మహబూబాబాద్ రోడ్డులోని 221 సర్వే నెంబర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూమి ధర పెరుగుతుందనే ఆశతో ఇళ్లు నిర్మించకుండా ఉంచగా, ఇప్పుడు ఆ భూమి గుండా జాతీయ రహదారి వెళ్తుండటంతో నష్టపోతున్నామని పేర్కొన్నారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు పనులు ప్రారంభించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితులు ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో పుల్లారావు, లేబర్ ఆఫీసర్ రవి, సీడీపీవో రేష్మ, ఏటీడబ్ల్యూవో ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్ నాయక్, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్, ఫారెస్ట్ అధికారి వాంకుడోత్ కర్ణ నాయక్, వైద్యాధికారి ప్రియాంక, ఎక్సైజ్ ఎస్ఐ శంకర్ తదితరులు పాల్గొన్నారు.